ఆళ్లగడ్డ: ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కర్నూల్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బాచుపల్లి గ్రామంలో వైసిపి అభ్యర్థికి ఓటేయాలంటూ పోలింగ్ బూత్ దగ్గర్లోని ఓ కాలనీలో కొందరు యువకులు ప్రచారం చేశారు. దీన్ని గుర్తించిన టిడిపి నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాచుపల్లి గ్రామానికి వెళ్లడానికి యత్నించారు. అయితే ఆమె వెళితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం వుంటుందని భావించిన పోలీసులు మార్గమధ్యలోనే ఆమెను నిర్భందించారు. దీంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అఖిల మండిపడ్డారు. 

ఇవాళ(గురువారం) ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు.. 7,220 ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 

పరిషత్‌ ఎన్నికల కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీలో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 247 పోలింగ్‌ కేంద్రాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 3,538 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 13 జిల్లాల్లో మొత్తం 2,46,71,002 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 375 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు.

పోలింగ్ కేంద్రాల్లో విధిగా కోవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు. ఓటర్లు మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటించాలి. ధర్మల్ స్కానింగ్ తర్వాతే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయిన ఓటర్లకు అవసరమైన పీపీఈ కిట్లు అందిస్తారు. వారికి పోలింగ్ చివరి గంటలో ఓటేయడానికి అనుమతిస్తారు.

పోలింగ్ జరుగుతున్న తీరును తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ విధానంలో ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అత్యంత సున్నితమైన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోగల పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమేరాలు అమర్చారు. కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఓ ప్రకటనలో తెలిపారు.