పరిషత్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు ఏప్రిల్ 7,8 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 8వ తేదీన జరగనున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు ఏప్రిల్ 7,8 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల ఏర్పాట్ల కోసం 7న, పోలింగ్ కోసం 8న సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలు జరిగే చోట్ల 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం సూచించింది.
ఇప్పటికే పోలింగ్ సామాగ్రి తరలించడం సహా పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. అటు పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఓటు సిరా గుర్తు వేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన సిరా.. ఇంకా చెరిగిపోనందున చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాలని ఆదేశించింది.
