హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను మంత్రులు బేఖతారు చేస్తున్నారు. ఆయన జారీ చేసిన ఆదేశాలను మంత్రులు రెండు నెలలుగా పక్కన పెట్టేశారు. జగన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ 13 మంది మంత్రులు గత తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన సిబ్బందిని అలాగే ఉంచుకున్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పనిచేసిన సిబ్బందిని మంత్రులు తమ వద్ద నియమించుకోకూడదని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గం ఏర్పాటు కాగానే ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు. తమ పేషీల్లో నియమించుకునే సిబ్బంది వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని కూడా ఆయన సూచించారు. 

ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ), ప్రైవేట్ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా గత ప్రభుత్వ హయాంలో మంత్రుల పేషీల్లో పనిచేసినవారిని కొనసాగించవద్దని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. వారిని కొనసాగిస్తే గత ప్రభుత్వ ప్రభావం తమ ప్రభుత్వంపై పడుతుందని, అది మంచిది కాదని జగన్ భావించారు. 

జగన్ ప్రభుత్వంలోని దాదాపు 13 మంది మంత్రులు గత ప్రభుత్వంలోని ఉద్యోగులను తమ పేషీల్లో కొనసాగిస్తున్నారు. దీనిపై జగన్ మరోసారి దృష్టి సారించే అవకాశాలున్నాయి.