తాడేపల్లి: అంతర్వేది రథం కాల్చివేతపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. రథం కాల్చివేత బాధాకరమని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ బయటకు వచ్చి చూసి మాట్లాడాలని ఆయన అన్నారు. 

అంతర్వేది రథం కాల్చివేతపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారని ఆయన చెప్పారు. రథం కాల్చివేత ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి స్థాయి విచారణ జరపాలని డీజీపీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. రథాన్ని తగులబెట్టినవారిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేసారు. 

విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దల్ ముసుగులో కొంత మంది విద్రోహులు చర్చిపై రాళ్లు రువ్వారని ఆయన అన్నారు. చర్చి, మసీదు, గుడులపై దాడులు చేసేవారని క్షమించబోమని ఆయన అన్నారు. విచారణ జరుగుతుండగానే కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

పుష్కరాల సందర్బంగా చంద్రబాబు 40 దేవాలయాలను చంద్రబాబు కూల్చివేశారని, ఈ కూల్చివేతలో బిజెపి కూడా భాగస్వామ్యం ఉందని, చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను పునర్నిర్మించాలని జగన్ ఆదేశించారని ఆయన వివరించారు. దాడులు చేసే సంస్కృతి చంద్రబాబుదేనని, హైదరాబాదులో కూర్చొని జూమ్ లో చంద్రబాబు సలహాలు ఇస్తున్నారని మంత్రి విమర్శించారు. 

బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును అరెస్టు చేస్తే అంతర్వేది ఎలా వెళ్లారని ఆయన ప్రశ్నించారు. సోము వీర్రాజును హౌస్ అరెస్టు చేయలేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అంతర్వేది ఆలయ ఈవోను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు దెయ్యం మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలపై 30 మంది అధికారులను తొలగించామని, పనికి మాలిన ఎంపీ రఘురామకృష్ణమ రాజు ఢిల్లీలో కూర్చుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నరని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ మాదిరిగా తాము ఓట్ల కోసం రాజకీయం చేయడం లేదని, ఎన్నికలకు ముందు తన పిల్లలు క్రిస్టియన్లు అని అన్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత హిందువులు అంటున్నారని ఆయన అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ ను రెండు చోట్ల ఓడించారని అన్నారు. 

చంద్రబాబు షూటింగ్ కోసం 29 మందిని చంపేశారని, పుష్కరాల పేరుతో వందల కోట్లు దోచుకున్నారని అంటూ చంద్రబాబు పాపాల్లో బిజెపి, జనసేనలకు భాగం లేదా అని ప్రశ్నిం్చారు.