నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం రామకోటారెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి చర్చలు జరిపారు.

వారింట్లోనే అందరూ కలిసి భోజనం చేశారు. ఓ ఇంటికి సంబంధించిన గొడవ కారణంగా బావబావమరుదుల మధ్య గొడవ జరిగిందని జిల్లాలో చర్చ నడుస్తోంది. నెల్లూరు రూరల్ మండలం మద్దూరుపాడులో రోడ్డుకు ఒక ఇళ్లు అడ్డుగా ఉందనే విషయంలో గొడవ నడిచింది.

దీనిపై తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షలు కూడా చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతలైన బీద సోదరులు తమకు వ్యతిరేకంగా స్పందించారంటూ రామకోటారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు రామకోటారెడ్డి ఇంటికి వెళ్లడం, అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో వీరి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరినట్లు పచ్చకండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.