అమరావతి: కేంద్రప్రభుత్వంపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ రాలేదని ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన షెడ్యూల్ 9,10లో ఉన్న ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదన్నారు. 

పంపకాలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం, కేంద్రలో పెద్దలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఆఖరికి ఆయన  బంధువు అయిన సినీహీరో మహేశ్ బాబును కూడా వదల్లేదని ఆరోపించారు. 

జీఎస్టీ కేసులో మహేశ్ బాబును ఇరికించారని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ టూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లండన్ వెళ్లి ఏఏ దేశాల వారిని సంప్రదిస్తున్నారో ప్రజలకు జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

వివిధ దేశాల్లో దాచిన డబ్బును తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చు చెయ్యాలని వైసీపీ చూస్తోందని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఒక్కో వైసీపీ ఎంపీ అభ్యర్థి రూ.100కోట్లు ఖర్చు చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ఇకపోతై వైసీపీలో వలసలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వ్యాపారాలు ఉన్న వారిని భయపెట్టి వైసీపీలో చేర్చుకుంటున్నారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.