శవాలను చూస్తే బాబుకు ఎక్కడాలేని ఉత్సాహం: మంత్రి కొడాలి నాని
సోమవారం నాడు ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ లో అద్దాల మేడలో కూర్చొని ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం జగన్ పై టీడీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.
శవాలను చూస్తే చంద్రబాబుకు ఎక్కడాలేని ఉత్సాహం వస్తోందని ఆయన విమర్శించారు. హైద్రాబాద్ లో దాక్కొన్ని అంతా అపరేట్ చేస్తున్నారని బాబుపై మంత్రి నాని మండిపడ్డారు.
గతంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ మహేశ్వరరావు చంద్రబాబు మాటలు విని తమపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తన మంత్రిత్వశాఖను నిర్వహించడంలో ఎలా విఫలమయ్యారో చెప్పాలన్నారు.
కరోనాను కంట్రోల్ చేయడంలో ఏపీ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని మంత్రి నాని గుర్తు చేశారు. కరోనాను నియంత్రించేందుకు గాను రెడ్ జోన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను కూడ అందిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
చంద్రబాబును చూసి ఏం నేర్చుకోవాలని నాని దేవినేని ఉమను ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుండి అధికారాన్ని ఎలా కైవసం చేసుకోవాలా నేర్చుకోవాలా అని మంత్రి ఎద్దేవా చేశారు.