అమరావతి: సినిమాల్లో ఎన్టీఆర్ నటుడైతే, నిజ జీవితంలో చంద్రబాబు నటుడని ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.

సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ప్రపంచ రత్న బిరుదు ఇవ్వాలని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ ను సీఎం సీటు నుండి దించిన వ్యక్తే ఇవాళ ఆయన సమాధికి దండలు వేయడం దారుణమన్నారు.

పదవుల కోసం చంద్రబాబునాయుడు ఎంతకైనా దిగజారుతారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ ను ఇష్టపడే వ్యక్తులంతా కలిసి చంద్రబాబునాయుడిని రాష్ట్ర సరిహద్దులు దాటించాలని ఆయన కోరారు. 

ఎన్టీఆర్ చనిపోయిన రోజు లేదా పుట్టినరోజునే ఆయనకు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తారని మంత్రి చెప్పారు. ఢిల్లీలో చక్రాలు బొంగరాలు తిప్పిన రోజుల్లో చంద్రబాబుకు ఎందుకు భారత రత్న ఇప్పించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైద్రాబాద్ లో కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు విషయంలో చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.

ఈ విషయమై మాట్లాడితే  తెలంగాణ ప్రభుత్వం ఊరుకోదనే భయంతో చంద్రబాబు నోరు మెదపడం లేదని  మంత్రి నాని చెప్పారు. అఖిలప్రియను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తే  చంద్రబాబునాయుడు నట విశ్వరూపం చూసే వాళ్లమన్నారు.టీడీపీని చంద్రబాబునాయుడు, లోకేష్  భూస్థాపితం చేస్తారని ఆయన చెప్పారు.