అమరావతి: తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పడలేదని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లయిస్  శాఖ మంత్రి  కొడాలి నాని చెప్పారు.సోమవారం నాడు  ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  చంద్రబాబునాయుడు చెప్పినట్టుగా బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు  వేస్తే  80 నుండి 90 శాతం పోలింగ్ శాతం నమోదయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా నియంత్రణ చేయడం అంటే లాక్ డౌన్ పెట్టడం పరిష్కారం కాదని ఆయన చెప్పారు. మాస్కులు, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీపై తాను వ్యాఖ్యానించనన్నారు. ఈ నెల 17వ తేదీన  తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  వైసీపీ  దొంగ ఓట్లు వేసిందని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విషయమై బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ  ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు.