అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై పొగడ్తల వర్షం గుప్పించి అడ్డంగా బుక్కయ్యారు ఏపీ మంత్రి జయరాం. ఈనెల 24న అసెంబ్లీలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించిన మంత్రి జయరాం జగన్ ను ఒక రేంజ్ లో పొగిడేశారు. 

సీఎం వైయస్ జగన్ క్రైస్తవులకు జీసస్ అని, ముస్లింలకు అల్లా అని, దళితులకు అంబేడ్కర్ అంటూ పొగడ్తలతో సభలో ఊదరగొట్టారు. వైయస్ జగన్ ముస్లింలకు అల్లా అంటూ చేసిన వ్యాఖ్యలపై కొందరు ముస్లిం సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

దీంతో మంత్రి జయరాం స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో కొన్ని ముస్లిం సామాజిక వర్గానికి మనస్తాపాన్ని కలిగించినట్లు తెలిసిందని అందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం కోటా బిల్లు చట్టంగా మారుతున్న సమయంలో తాను ఉద్వేగంతో మాట్లాడానని తెలిపారు.

సీఎం జగన్ ను అలా పోల్చుతూ మాట్లాడానే తప్ప వేరే ఏ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో తప్పుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానంటూ మంత్రి జయరాం ప్రకటన విడుదల చేశారు. 

ఇకపోతే ఈనెల 24న జరిగిన అసెంబ్లీ సమావేశంలో జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు మంత్రి జయరాం. జయరాం పొగడ్తల నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ ఆపన్నా అంటూ చెప్పుకొచ్చారు అయినా వినలేదు. దండం సైతం పెట్టి ఇక ఆపన్నా అన్నా వినకుండా పొగిడారు. చివరకు ఇలా అడ్డంగా బుక్కై చివరకు క్షమాపణలు చెప్పే వరకు వెళ్లింది.