మంత్రివర్గంలో మార్పులపై ఊహగానాలు: రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న జయరాం
మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందనే ప్రచారం నెలకొనడంతో మంత్రి జయరాం ఇవాళ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.
కర్నూల్: జిల్లాలోని రాఘవేంద్రస్వామిని మంత్రి గుమ్మనూరు జయరాం గురువారంనాడు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగడంతో రాఘవేంద్రస్వామిని మంత్రి జయరాం దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంత్రి జయరాం రాఘువేంద్రస్వామి ఆలయానికి వచ్చారు. గతంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని పీఠాధిపతి కోరినా కూడా మంత్రి రాలేదు.
ఈ నెల 14వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఏపీ సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే కొందరు మంత్రులను మంత్రివర్గం నుండి తప్పిస్తానని కూడా ఆయన తేల్చి చెప్పారు. పనితీరును గమనిస్తున్నానని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయితే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన కొందరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశంపై జగన్ ఆలోచిస్తున్నారని సమాచారం.
also read:జూలై మాసంలో విశాఖ నుండి పాలన: మంత్రులకు జగన్ వార్నింగ్
తొలి దశలో కూడా జయరాం కు మంత్రివర్గంలో చోటు దక్కింది. రెండో దఫా కూడా జగన్ ఆయనను కొనసాగించారు. అయితే జయరాంను ఈ దఫా తప్పించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో గుమ్మనూరు జయరాం రాఘువేంద్రస్వామిని దర్శించుకున్నారు. అనుచరుల సూచన మేరకు ఇవాళ ఉదయమే రాఘవేంద్రస్వామిని మంత్రి జయరాం దర్శించుకున్నారు.
రాఘవేంద్ర స్వామి ఆలయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులతో మంత్రి జయరాం ఆశీర్వచనం తీసుకున్నారు. తన మంత్రి పదవి కొనసాగేలా ఆశీర్వదించాలని మంత్రి పీఠాధిపతిని కోరారు.త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఎన్నికలకు వెళ్లే సమయంలో మంచి జట్టు ఉండాలని జగన్ భావిస్తున్నారు. దరిమిలా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారని సమాచారం.