ఒడిషా రైలు ప్రమాదం.. కొందరు ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్
కోరమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లలో రిజర్వేషన్లు చేయించుకున్న ఏపీ వాసుల వివరాలను సేకరిస్తున్నామన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. అయితే వీరిలో కొందరు ఫోన్లకు స్పందించడం లేదని ఆయన తెలిపారు.

ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో బెంగాల్, ఒడిషాలకు చెందిన ప్రయాణికులే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే కోరమండల్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పలువురు తెలుగు ప్రయాణీకులు వున్నట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచన మేరకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ , మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఒడిషాకు వెళ్లారు.
దీనిపై మంత్రి గుడివాడ స్పందించారు. సదరు రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులను గుర్తించే పనిలో వున్నట్లు తెలిపారు. అందరికీ ఫోన్లు చేస్తున్నామని వీరిలో కొందరు స్పందిస్తూ వుండగా.. మరికొందరి ఫోన్లు స్పందించడం లేదని తెలిపారు. ఫోన్ కాల్స్‌కు స్పందించని వారిని గుర్తించే పనిలో వున్నామని గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని.. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌ను కూడా వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదం ఘటనలో ఏపీ వాసులెవ్వరూ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం లేదన్నారు రాష్ట్రానికి చెందిన ప్రయాణీకులకు గాయాలైనట్లుగా తెలుస్తోందన్నారు. బాధితుల కోసం మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు ఒడిషాకు వెళ్లారని ఆయన చెప్పారు. బాధితులకు కటక్, భువనేశ్వర్‌లలోని ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని బొత్స తెలిపారు.
రాష్ట్రానికి చెందిన ప్రయాణీకులను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సత్యనారాయణ పేర్కొన్నారు. ఒడిషా ప్రభుత్వం, రైల్వే శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని బొత్స కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని సత్యనారాయణ పేర్కొన్నారు.
అయితే ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కువ భాగం దెబ్బతిన్నట్టుగా చెబుతున్నారు. ఈ రెండు రైళ్లలో కూడా పలువురు తెలుగు ప్రజలు ఉన్నారు. దాదాపు 200 మంది వరకు తెలుగువారు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే రైల్వే శాఖ మాత్రం రిజర్వేషన్ చేయించుకున్న వారి వివరాలను మాత్రమే అందించగలుగుతుంది. జనరల్ బోగీలలో ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తెలియడం లేదు.
ఇక, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలలో స్టాప్‌లు ఉన్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌లో దిగేందుకు రిజర్వేషన్ చేయించుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. వారిలో 100 మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. జనరల్ బోగీల్లో ఎంతమంది ఏపీ ప్రయాణికులున్నారో పరిశీలించాల్సి ఉందని చెప్పారు.