Asianet News TeluguAsianet News Telugu

ఏది ముఖ్యం: పవన్ కల్యాణ్ కు గౌతమ్ రెడ్డి సూటి ప్రశ్న

ప్రజల ఆరోగ్యం ముఖ్యమో, స్తానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమో తేల్చి చెప్పాలని మంత్రి గౌతమ్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు. దివీస్ మీద ఆయన వివరణ ఇచ్చారు.

AP minister Goutham Reddy questions Jana Sena chief Pawan Kalyan
Author
Amaravathi, First Published Jan 10, 2021, 6:01 PM IST

అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? తేల్చి ఎస్ఈసీకి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు. ప్రజారోగ్యంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే , ప్రజల ఆరోగ్య గురించి పట్టించుకునే వారైతే ఈ పని చేయాలని ఆయన అన్నారు.

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్న చట్టం రాష్ట్రంలో ఏడాదిన్నర ముందే సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ దివీస్ కి వస్తుండడం తెలిసి 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ప్రకటించినట్లుగా మాట్లాడారని ఆయన అన్నారు. దివీస్ పర్యటనలో అవగాహనలేని మాటలు మాట్లాడారని ఆయన అన్నారు.

నిజానికి తమ ప్రభుత్వం రాగానే అంటే జులై, 19, 2019లో  75 శాతం స్థానికులకు ఉద్యోగాల గురించి  మొదటి కేబినెట్ లోనే ఆమోదించి, ఆ వెంటనే అసెంబ్లీలో చట్టం చేసిందని గౌతమ్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ చదువుకున్నవారని, ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే సెంట్ జోసఫ్ లో 10వ తరగతి చదివారని కూడా తెలుసునని, మరి తెలిసి మాట్లాడుతున్నారో..తెలియక మాట్లాడుతున్నారో తనకు అర్థం కాలేదని అన్నారు.

రాజకీయాల కోసం దివీస్ పరిసరాల ప్రజలను దయచేసి రెచ్చగొట్టవద్దని, మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన సూచించారు.  నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో స్థానిక యువతకు ఆ పరిశ్రమకు కావలసిన నైపుణ్యం అవసరాలను తెలుసుకుని, వారిని శిక్షణ ఇచ్చి, తీర్చిదిద్ది వారికి ఉద్యోగాలిస్తామని, ఆ ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించి ఆ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తుందని ఆయన చెప్పారు.

సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా అని పవన్ కళ్యాణ్ అడిగారని, సోషల్ ఇంపాక్ట్ స్టడీ అనేది పారిశ్రామిక రంగంలో సర్వ సాధారణమైన విషయమని, అది సెక్షన్ ఎ , సెక్షన్ బి కేటగిరీలను బట్టి  వాతావరణం, సమజాంపై ప్రభావితాల స్థాయిపై ఎన్విరాన్ మెంటల్ స్టడీ పరిశీలిస్తుందని ఆయన అన్నారు.

పరిశ్రమ స్ధాపనకు ముందే ...అది స్థానిక ప్రజలపై ఎలా ప్రభావం చూపిస్తుందో పరిశీలన జరుగుతుందని, ఇవన్నీ కాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టడీ చేసి చివరిగా  అన్ని అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్నాకే పరిశ్రమకు సంబంధించిన అనుమతులు, మార్గదర్శకాలు, క్లియరెన్స్ ధృవపత్రాలు , ఎన్ఓసీలు జారీ అవుతాయని ఆయన వివరించారు.

దివీస్ కు అనుమతులు ఇచ్చింది తమ ప్రభుత్వం కాదని, తమ ప్రభుత్వ హయాంలో వచ్చింది కాదని, అయినా పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన ఆయన గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, గతంలో ఆ ప్రభుత్వం చేసిన పొరపాట్లు, తప్పులను సరిచేసి ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నామని గౌతమ్ రెడ్డి అన్నారు.

2016లో రామ్ కీ సంస్థని దివీస్ యాజమాన్యం సంప్రదించిందని, 80 శాతం ఎకనామికల్ క్లియరెన్స్ తీసుకొని వచ్చిందని. వాళ్లు థర్డ్ పార్టీ కూడా అని,  నిజానికి దివీస్ కి డైరెక్ట్ గా పని చేసింది చెన్నైలోని ఇండోమర్ కోస్టల్ హైడ్రాలిక్స్. మెరైన్ కాలుష్యంపై రిపోర్ట్ చేసింది వీళ్లేనని ఆయన అన్నారు.

"గత ప్రభుత్వానికి మద్దతు తెలిపింది మీరు కాదా?ఇవి అప్పుడు జరిగినవే కదా?  కొత్తగా ఇప్పుడు మీ మొసలి కన్నీరు ఎందుకు? అప్పుడు లేని  బాధ ఇప్పుడు కొత్తగా మీకెందుకు? 2015లో గత ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఏం చేశారు"  అని ప్రశ్నించారు.

దివీస్ పరిశ్రమ, స్థానిక ప్రజల ఆందోళనపై ప్రభుత్వం ప్రతిపక్షాల కన్నా ముందే స్పందించిందని, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షమే. స్పందించడంలో ఎప్పుడూ తామే ముందున్నామని ఆయన చెప్పారు.

ప్రజల భయాందోళనలను తొలగిస్తూ ఎటువంటి వ్యర్థాలను విడుదల చేయకూడదని స్పష్టంగా పరిశ్రమల శాఖ ద్వారా దివీస్ కు ఇప్పటికే లేఖ రాశామని ఆయన చెప్పారు. కీలక నిర్ణయం తీసుకున్నామని, దివీస్ ఆందోళన డిసెంబర్ 17న జరిగితే, 19వతేదీనే సమావేశమై ప్రజల ప్రయోజనాలు కాపాడే చర్యలు చేపట్టామని, స్థానిక మత్స్యకారులు, ప్రజల అంగీకారం లేకుండా ఒక్క ఇటుకా పెట్టకూడదని స్పష్టంగా దివీస్ యాజమాన్యానికి ఆదేశించామని ఆయన వివరించారు.

జనవరి 6వ తేదీన స్థానిక మత్స్యకారులు, హేచరీస్ అందరితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించామని, వారందరి అభిప్రాయాలపై చర్చించి కమిటీ వేశామని ఆయన చెప్పారు.జనవరి 8న పరిశ్రమల శాఖ ద్వారా దివీస్ కు మరో లేఖ రాశామని, కాలుష్యంపై స్పష్టత ఇవ్వకుండా ముందుకు వెళ్లవద్దని తేల్చి చెప్పామని ఆయన అన్నారు.

మత్స్యకారులకు ఇబ్బందే లేకుండా హేచరీస్ జోన్ లో ముందస్తు కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటేనే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియన్స్ కు అనుమతిస్తామని చెప్పామని అన్నారు.మత్స్యకారులు, హేచరీస్ కు సంబంధించిన వారు, పరిశ్రమల అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు,  స్థానిక ప్రజలందరి భాగస్వామ్యంతోనే కమిటీ వేశామని ఆయన గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios