విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వంపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయని ఆరోపించారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా పార్టీలు మారడం తప్పులేదన్నారు. కానీ పార్టీలు మారిన తర్వాత చంద్రబాబుపైనా, పార్టీపైనా బురద జల్లడం సరికాదని హితవు పలికారు. అవకాశవాద రాజకీయాల కోసం అవినీతి పరులతో చేతులు కలుపుతూ పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. 

వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికకు లోటస్ పాండ్ మడుగు నుంచి ప్రారంభమైందని దేవినేని ఆరోపించారు. కేసీఆర్, బీజేపీ అండ చూసుకుని జగన్ రెచ్చిపోతున్నారని ఇక వారి ఆటలు సాగవన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపును అడ్డుకోలేరన్నారు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.