విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. నాలుగువారాలు ఓపికపడితే తేలుస్తానంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన విజయసాయిరెడ్డి ఆర్థిక ఉగ్రవాది, నేరస్థుడంటూ ఆరోపించారు. 

ఏ2 ముద్దాయి అయిన విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ సంగతి చూస్తామంటూ బెదిరింపు ధోరణిలో ఉంటున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటే అతని బెయిల్ కూడా రద్దు అవ్వడం ఖాయమన్నారు. 

రాజాంగేతర శక్తిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ట్విట్టర్లో కాకుండా నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతుందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలకు ప్రజాక్షేత్రంలో తిరిగే అర్హత లేదన్నారు. వీరిద్దరూ తీహార్ జైల్లో ఉండాల్సిందేన్నారు. అవినీతిపరులు పోలవరంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. 

పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం ఇంత వరకు చెల్లించలేదని స్పష్టం చేశారు. అయినా పోలవరం పూర్తవుతుందంటే అది చంద్రబాబు ఘనతేనని, పోలవరాన్ని ముఖ్యమంత్రి శరవేగంగా నిర్మిస్తున్నారని దేవినేని ఉమా కొనియాడారు.

ఒకప్పుడు పోలీసులను చూసి దొంగలు పారిపోయేవారని, కానీ ఇప్పుడు దొంగలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మారిపోతున్నారని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అధికారులను బెదిరించే విధంగా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. 

వైసీపీపై బెట్టింగ్‌ పెట్టిన వాళ్లంతా డబ్బులు తిరిగివ్వమని ప్రాధేయపడుతున్నారని, తిరిగి టీడీపీ గెలుపుపై బెట్టింగ్‌లు పెడుతున్నారంటూ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. కొడికత్తి దొంగలను నమ్ముకుంటే నష్టపోతారని దేవినేని ఉమా అన్నారు. 

ఇకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతుందోనని నిలదీశారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.