అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మున్సిపాలిటీ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడుల్లో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారంటూ చంద్రబాబు ఆరోపించడాన్ని బొత్స ఖండించారు. 

దాడుల్లో చనిపోయిన ఆరుగురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చాలంటూ చంద్రబాబు చేపట్టిన పరామర్శయాత్రలపై సెటైర్లు వేశారు. చంద్రబాబు యాత్రలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. దాడులు చేసేది మీరే యాత్రలు చేసేది మీరే అంటూ విరుచుకుపడ్డారు. దాడులు చేసి తమపై రుద్దుతారా అంటూ విరుచుకుపడ్డారు బొత్స.

ఈ సందర్భంగా అసెంబ్లీ భవనాల నిర్మాణాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఒక ప్రణాళిక అనేది లేకుండా అసెంబ్లీ భవనాలను నిర్మించారని బొత్స అభిప్రాయపడ్డారు. 

అసెంబ్లీ భవనంలో ఎలాంటి వసతులు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. సందర్శకులు వచ్చినా కనీస సదుపాయాలు కూడా ఉండటం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఛాంబర్ల మార్పు, వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్ లో మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ.