హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు నేతలు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. 

ఇదిలావుంటే, మంగళవారంనాడు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.... ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 76 వేల 333కి చేరాయి. రాష్ట్రంలో వైరస్ కారణంగా 67 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,604కి చేరుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 79,104 యాక్టివ్ కేసులు ఉండగా.. 95,625 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 6,953 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 64,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీటితో ఇప్పటి వరకు 21 లక్షల 75 వేల 70 మందికి పరీక్షలు నిర్వహించినట్లయ్యింది. 

మంగళవారంనాటి కేసులతో కలిపి పాజిటివ్ కేసుల్లో దేశంలో మూడో స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మంగళవారంనాడు అనంతపురం జిల్లాలో అత్యథికంగా 1,325 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత తూర్పు గోదావరి 1,371, కర్నూలు 1,016, చిత్తూరు 26, గుంటూరు 940, కడప 765, కృష్ణ 420, నెల్లూరు 557, ప్రకాశం 224, శ్రీకాకుళం 537, విశాఖపట్నం 863, విజయనగరం 591, పశ్చిమ గోదావరిలలో 612 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు కోవిడ్ వల్ల గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కృష్ణ 9, కర్నూలు 8, చిత్తూరు 7, తూర్పుగోదావరి 7, నెల్లూరు 7, అనంతపురం 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 2, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.