Asianet News TeluguAsianet News Telugu

మీకంటే ఎక్కువే మాట్లాడగలం.. చేతకాకకాదు : తెలంగాణ మంత్రులకు అనిల్ కుమార్ కౌంటర్

తెలంగాణతో నెలకొన్న కృష్ణానదీ వివాదంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి స్పందించారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 

ap minister anil kumar yadav counter to telangana ministers over water dispute ksp
Author
Amaravathi, First Published Jun 30, 2021, 5:17 PM IST

తెలంగాణతో నెలకొన్న కృష్ణానదీ వివాదంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి స్పందించారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నామని.. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

శ్రీశైలం డ్యామ్ నిండకూడదనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని .. కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసినా విద్యుత్ ఉత్పత్తి ఆపలేదని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తితో కృష్ణా జలాలు వృథా అవుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఇవాళే లేఖ రాస్తున్నామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. మాట్లాడటం మాకు చేతకాక కాదని.. సంయమనంతో వున్నామని మంత్రి తెలిపారు.

అడ్డదిడ్డంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే కేఆర్ఎంబీ ఎందుకని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా పాలమూరు ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని.. జల్‌శక్తి మంత్రికి ఇవాళే లేఖ రాస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ వృథా చేస్తున్న నీటిని కుదించాలని కేఆర్‌ఎంబీకి లేఖ రాస్తున్నామన్నారు. తెలంగాణకు కేటాయించిన 290 టీఎంసీలు కట్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

Also Read:కేసీఆర్ సర్కార్ పై ప్రధానికి ఫిర్యాదు... జలవివాదంపై అమీతుమీకి సిద్దమైన జగన్

మాకు పనులు ఆపాలని కేఆర్ఎంబీ ఎటువంటి లేఖ రాయలేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ బృందం పాలమూరు- రంగారెడ్డిని పరిశీలించాలని ఆయన కోరారు. వైఎస్సార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఆయన.. రెచ్చగొట్టేతత్వం వుండకూడదని హితవు పలికారు. పరుషంగా మాట్లాడితే వివాదం పరిష్కారం అవుతుందనుకుంటే మేమూ మాట్లాడగలమని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగులకే నీటిని డ్రా చేస్తోందని ఆయన చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని జగన్ ఎప్పుడో చెప్పారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ ప్రాజెక్ట్‌లను కడుతోందని ఆయన ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 844 అడుగులు పైకి వుంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios