ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో మంత్రి ఆళ్ల నాని ఓటు వేయకుండానే వెనుదిరిగారు. కార్పోరేషన్ లోని 25వ డివిజన్ లో ఉండాల్సిన మంత్రి ఓటు గల్లంతైంది. దీంతో ఆయన ఓటు వేయలేకపోయారు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయడానికి వెళ్లిన మంత్రి ఆళ్ల నానికి అనూహ్యమైన సంఘటన ఎదురైంది. ఏలూరు కార్పోరేషన్ లో ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. ఏలూరులోని 25వ డివిజన్ లో ఓటు వేయడానికి మంత్రి వచ్చారు. అయితే, ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో మంత్రి ఆళ్ల నాని ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. 

ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏలూరు పరిధిలో ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశంపై 40కి పైగా పిటిషిన్లు దాఖలయ్యాయి. టీడీపీ చెందిన కొందరు నేతలు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఫారం -7ను ఉపయోగించుకుని టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని వారు పిటిషన్లలో ఆరోపించారు. 

జాబితాలోని అవకతవకలను సవరించాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలు అమలులోకి రాకముందే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఏలూరు కార్పోరేషన్ లో ఎన్నికలను నిలిపేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రభుత్వం డివిజన్ బెంచీలో సవాల్ చేసింది. పోలింగ్ నిర్వహించాలని, అయితే తీర్పు వచ్చేంత వరకు ఫలితం ప్రకటించవద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో బుధవారం ఏలూరు కార్పోరేషన్ లో పోలింగ్ జరుగుతోంది.

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వనియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

కాగా, విజయవాడలో ఒకే ఇంట్లోనే వ్యక్తుల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని విజయవాడ కార్పోరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత చెప్పారు. తమ ఇంట్లోని ముగ్గురు ఓట్ుల వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయని ఆమె చెప్పారు.