దళితులను చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని మండిపడ్డారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగుదేశం రాజకీయ రాద్ధాంతం చేస్తోందని సురేశ్ విమర్శించారు.

టీడీపీ నేతలకు ప్రజా సేవ ముఖ్యం కాదన్న ఆయన... ప్రతీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించి లిటిగేషన్లు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కడుపు మంటతో టీడీపీ ఆరోపణలు చేస్తోందని సురేశ్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నెరవేరుస్తుంటే.. టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు.