రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎయిడ్స్ వ్యాధి కలకలం రేపుతోంది. రోజురోజుకు ఎయిడ్స్ వ్యాధి బారినపడిన ఖైదీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జైల్లోకి రాకముందు 19 మంది ఖైదీలకు ఎయిడ్స్ వ్యాధి ఉందని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 

జైల్లోకి రాకముందే 19 మందికి ఎయిడ్స్ వ్యాధి బాధితులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 27కి పెరిగిందని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఖైదీ బుధవారం ఎయిడ్స్ వ్యాధి  కారణంగా తనకు రెండు నెలలు పాటు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. 

దాంతో కోర్టు జైల్లో ఎయిడ్స్ బాధితులపై ఆరా తీయగా అప్పుడు వ్యవహారం అంతా బయటకు వచ్చింది. జైల్లో 27 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని జైళ్లశాఖ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మెుత్తం జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారని హైకోర్టు ఆరా తీయగా మెుత్తం 1500 మంది ఖైదీలు ఉన్నారని తెలిపింది. 

జైల్లో ఇంతమందికి ఎయిడ్స్ వ్యాధి ఉండటం సీరియస్ అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారో వివరాలతో సహా విచారణకు హాజరుకావాలని జైళ్ల సూపరింటెండెంట్ ను ఆదేశించింది.