అమరావతి: ఆనందయ్య మందును పంపిణీ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉమా మహేశ్వరనాయుడు తరపున బాలాజీ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ తో పాటు మరో పిటిషన్ కూడ దాఖలైంది. మందుపంపిణీ, ఖర్చును భరించడంతో పాటు ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే భరించాలని పిటిషనర్లు కోరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కూడ పిటిషనర్లు కోరారు. మరో వైపు లోకాయుక్త ఆదేశాల మేరకు మందు పంపిణీ నిలిపివేసినట్టుగా పోలీసులు చెబుతున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. 

also read:ఆనందయ్య కరోనా మందు: ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

ఈ పిటిషన్ ను విచారణకు ఏపీ హైకోర్టు స్వీకరించింది. ఈ నెల 27న ఏపీ హైకోర్టు  ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది. అయితే మందు పంపిణీని నిలిపివేయాలని చెప్పే అధికారం లోకాయుక్తకు లేదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.  మందు పంపిణీ నిలిచిపోవడంతో  రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉందని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. ఈ మందు శాస్త్రీయతను నిర్ధారించే ప్రయత్నాలు సాగుతుున్నాయి. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రతినిధులు  పరిశోధిస్తున్నారు.ఈ పిటిషన్లపై ఈ నెల 27న విచారణ నిర్వహించనున్నట్టుగా ఏపీ హైకోర్టు ప్రకటించింది.