చంద్రబాబు క్వాష్ పిటిషన్: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇరువర్గాల వాదనలు ముగిసిన తర్వా తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు మంగళవారంనాడు రిజర్వ్ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రాలు వాదించారు.
ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఈ వాదనలను ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా రోహత్గీ చెప్పారు.ఈ నెల 9వ తేదీన ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నుండి చంద్రబాబును సమర్ధిస్తూ ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు ముందు వాదించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఎంతమంది విద్యార్థులు ప్రయోజనం పొందారనే విషయాన్ని కూడ కోర్టుకు చంద్రబాబు లాయర్లు అందించారు.
also read:రెండేళ్లు సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్: చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీ తరపు న్యాయవాది
చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేని విషయాన్ని బాబు తరపు లాయర్లు ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదించారు. అయితే ఈ వాదనలను ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. నిబంధనలకు విరుద్దంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం సాగిందని ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు వాదించారు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇరు వర్గాలు వాదనలు విన్నది కోర్టు. అయితే తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.