టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంశీ ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పిటిషన్ వేశారు. 

టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో వంశీ రిగ్గింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారని.. రెండేళ్ల క్రితం పిటిషన్ దాఖలు చేసినా ఇప్పటి వరకు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషన్‌దారులు. 

కోవిడ్ కారణంగా ఆలస్యమైనా.. ఇప్పటికీ విచారణ చేయకపోవడంతో పిటిషన్ ఫలితం లేకుండా పోతుందని న్యాయస్థానానికి వివరించారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఎమ్మెల్యే వంశీ, గన్నవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది కోర్ట్. అలాగే బాపులపాడులో ఎమ్మార్వో స్టాంపు ఫోర్జరీ చేశారని.. వంశీ, ఆయన అనుచరులు 12 వేల నకిలీ ఇళ్లపట్టాలు పంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు.