అమరావతి: ఈఎస్ఐ స్కాం అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.   ఇవాళ ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. 

దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించారు అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం. '' ఈ నేరంలో చాలా తీవ్రత ఉంది. నిందితుడైన మాజీ మంత్రి, అచ్చెన్నాయుడి ప్రమేయంతోనే ఈ నేరం జరిగింది. నేరంలో ఆయన ప్రధాన సూత్రధారి. 2016 సెప్టెంబరు నుంచి కూడా ఆయా కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. ఈ వివరాలన్నీ కూడా దిగువ కోర్టుకు సమర్పించాం'' అని హైకోర్టుకు తెలిపారు.

''సెప్టెంబరు 25,2016లో అప్పటి మంత్రి నివాసంలో, ఆయన సమక్షంలో జరిగిన సమావేశం ఉద్దేశం ఏంటి? అన్నది చూడాలి. ఈ మీటింగు మినిట్స్‌ను కూడా పరిశీలించాలని కోరుతున్నా.  ఆరోజు సమావేశానికి హాజరైన వ్యక్తులందరినీ కూడా అరెస్టు చేశాం. టోల్‌ఫ్రీ సర్వీసులకు సంబంధించిన సదరు కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు'' అని వివరించారు.  

''తెలంగాణలో ఒక కంపెనీకి ఇచ్చారు కాబట్టి, అదే ప్రాతిపదికన కాంట్రాక్టు ఇవ్వాలని ఈఎస్‌ఐ డైరెక్టర్‌ను ఆదేశించారు. టెండరింగ్‌ ప్రాసెస్‌తో సంబంధం లేకుండా  ఇ–ప్రొక్యూర్‌ మెంట్‌తో సంబంధం లేకుండా ఇలా ఒక నిర్ణయం తీసుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం.  ఒక ప్రైవేటు కంపెనీతో ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి తీసుకున్న నిర్ణయమిది.  మెస్సర్స్‌ టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన దాఖలాలేవీ కూడా ప్రభుత్వంలో ఎక్కడా లేవు'' అని అన్నారు. 

read more   బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ అంత ఈజీ కాదది: విజయసాయికి బుద్దా స్ట్రాంగ్ కౌంటర్

''అప్పుడు మంత్రిగా నిర్ణయం తీసుకున్నారు...ఇప్పుడు విచారణ చేస్తున్నారు కాబట్టి ప్రొసీజరల్‌ సేఫ్‌ గార్డ్స్‌ పాటించాలని అచ్చెనాయుడు న్యాయవాది వాదించారు. గవర్నర్‌ లేదా స్పీకర్‌ అనుమతి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.  అయితే అప్పటి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు తన అధికార విధుల ప్రమాణాలను విస్మరించారు కాబట్టి, అలాంటి సందర్బంలో విచారణ, దర్యాప్తులకు ముందస్తు అనుమతి అవసరంలేదని ఏజీ వాదించారు. 

ప్రభుత్వ వ్యవస్థలపరంగా ఉన్న నియమాలను, నిబంధనలను పాటించలేదు. ప్రభుత్వ పరంగా విధానంప్రకారం నిర్ణయాలు తీసుకున్నట్టు విచారణలో ఎక్కడా కనిపించలేదు:
సవరించిన చట్టంలో అలాంటి నిబంధనలు లేవని, కొత్తచట్టం నిబంధనలు గతంలో చేసిన నేరాలకు వర్తించవని ఏజీ వాదించారు. ఇలా చేస్తే అవినీతిని పెంచేదిగా ఉంటుందని, అవినీతి చేసిన వ్యక్తులను కాపాడేదిగా ఉంటుందన్నారు. 

''రాజకీయ ప్రయోజనాలను ఆశించి నేరం జరిగిన రోజుల్లో విచారణ చేయకపోతే కొత్త చట్టం ద్వారా అలాంటి వ్యక్తులకు రక్షణలు కల్పించడం అన్నది సరికాదన్నారు. అవినీతి అభియోగాలను ఎదుర్కొంటున్న వారికి సవరించిన చట్టం ఉద్దేశం కాకూడదన్నారు. 

ఏపీ ఫైనాన్స్‌ కోడ్‌ ప్రకారం, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం జారీచేసిన జీఓల ప్రకారం లక్ష రూపాయలు పైబడి ఏదైనా కాంట్రాక్టు కాని, సర్వీసుగాని తీసుకోవాలనుకుంటే.. టెండర్‌ పద్ధతి పాటించాలి.కాని ఇక్కడ పాటించలేదు. ఇలాంటి విషయాల్లో పారదర్శకత పాటించాలన్నది కనీస నియమం. ఈఎస్‌ఐసీ అనేది టెలీ హెల్త్‌ సర్వీసులకు ఉద్దేశించి కాదు'' అని ఏజీ  వాదించారు.