టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఓ స్థల వివాదంకు సంబంధించి తనపై నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

వైఎస్ఆర్జిల్లా చక్రాయపేట మండలం సురభి గ్రామంలో వెంచర్‌లోకి చొరబడి ప్లాట్లను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై బీటెక్ రవి, ఆయన అనుచరులపై చక్రాయపేట పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. రియల్టర్ వెంకట సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. అయితే బీటెక్ రవి మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరిగింది. 

ఇక, చక్రాయపేట మండలం సురభి గ్రామంలోని నాగాల గుట్ట ప్రాంతంలో రియల్టర్లు కొంత మంది భూమి కొనుగోలు చేసి ప్లాట్లు అభివృద్ధి చేశారని రియల్టర్ వెంకట సుబ్బయ్య చెప్పారు. బీటెక్ రవి, చక్రాయపేట టీడీపీ మండల ఇంచార్జి మహేశ్వరరెడ్డి, వారి అనుచరులు 20 వాహనాల్లో సంఘటనా ఆ స్థలానికి చేరుకుని ట్రాక్టర్లతో ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. డాక్యుమెంట్ల ఆధారంగా భూమి కొనుగోలు చేసినట్టుగా చెప్పారు. అయితే అందులో కొంత భాగం వారిదంటూ బెదిరింపులకు దిగుతారని ఆరోపించారు.