స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. నారా లోకేశ్ బెయిల్ పిటిషన్ డిస్పోజ్..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. లోకేష్ దాఖలు చేసిన బెయిట్ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా.. ఆయనను ఈ నెల 12 వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మరోమారు విచారణ జరగగా.. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ఆయన కుటుంబ సభ్యులు లబ్ది పొందినట్టుగా ఆరోపణలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పిటిషనర్(లోకేష్)ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టుగా చెప్పారు.
మరోవైపు సీఐడీ తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేష్‌ను నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయనను అరెస్ట్ చేయబోమని తెలిపారు. ఈ కేసులో లోకేష్ పేరు చేర్చితే.. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించనున్నట్టుగా చెప్పారు. అయితే ఇరుపక్షాల వాదనల విన్న హైకోర్టు.. లోకేస్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేష్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.