గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిలకలూరిపేట మున్సిపాలిటీలో గణపవరం, పసుమర్రు గ్రామాల విలీనానికి సంబంధించి స్టేటస్‌కోను కోర్టు వెకేట్ చేసింది.

దీంతో అక్కడ అక్కడ మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. అయితే ఎన్నిక నిర్వహించాలని.. ఫలితం మాత్రం ప్రకటించొద్దని సూచించింది. తమ తీర్పు 15, 16 తేదీల్లో వెల్లడిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. 

అయితే, గతంలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో 34 వార్డులే ఉండగా.. గతేడాది మున్సిపల్‌ ఎన్నికల సమయానికి విలీన గ్రామాలైన గణపవరం, పసుమర్రు, మానుకొండవారి పాలెంలతో కలిపి 38 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించారు. అయితే కరోనా కారణంగా నామినేషన్ల ప్రక్రియ వరకు కొనసాగిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఈ క్రమంలో నాదెండ్ల మండలం గణపవరం, పసుమర్రు పంచాయతీల విలీనాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావటంతో.. కోర్టు ఆ రెండు పంచాయతీల విలీనంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అప్పటి నుంచి ఈ స్టే కొనసాగుతూ వచ్చింది. తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.