కరోనా బాధితులకు ఆక్సిజన్‌, పడకల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని.  చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆయన శనివారం తిరుపతి ఎస్వీ వర్సీటీలో ఉన్నతాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం 500 టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే రాష్ట్రానికి ఇస్తోందని... అందులో 40 టన్నుల్ని ఒక్క చిత్తూరుకే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లు పెంచితే ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని సమీక్షలో చర్చించినట్లు ఆళ్ల నాని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.   

Also Read:కరోనాపై తప్పుడు ప్రచారం: వైఎస్ జగన్ ప్రభుత్వం కొరడా

స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లభ్యతపై సమీక్షలో చర్చించామని ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందని.. కేంద్రం నుంచి వస్తున్న టీకాలను అదే రోజు ప్రజలకు అందేలా చూస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.