ఎక్కువ పరీక్షల వల్లే ఎక్కువ కేసులు: టీడీపీకి జవహర్ రెడ్డి కౌంటర్
కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏపిలో రోజురోజుకు పెరుగుతుండటంతో టిడిపి నాయకులు వైసిపి ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు.
అమరావతి: దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీ లోనే నిర్వహిస్తున్నట్లు స్టేట్ హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి తెలిపారు. ఎంత ఎక్కువగా పరీక్షలు చేస్తే అన్ని కేసులు ఎక్కువ బయటపడుతాయన్నారు. అలా ఏపిలోనూ ఎక్కువ పరీక్షల వల్ల ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని వెల్లడించారు.
పక్క రాష్ట్రం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతుండగా ఏపీలో మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్, వైసిపి నాయకులు, ప్రభుత్వంపై టిడిపి శ్రేణులు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇలాంటి విమర్శలకు జవహర్ రెడ్డి వివరణే సరయిన సమాధానంగా వైసిపి నాయకులు భావిస్తున్నారు.
ఆల్ ఇండియా రేంజులో పాజిటివిటీ రేట్ లో ఏపి చాలా తక్కువ ఉన్నా నంబర్లు మాత్రం పెరుగుతున్నాయన్నారు. అయితే ఇలా అంకెలు పెరగడం వల్ల గాబరా పడనక్కరలేదని.... కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి చెందుతోందన్నారు. మైల్డ్ గా కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు ఇంటిలోనే ఐసోలేషన్ లో ఉండొచ్చని జవహర్ రెడ్డి సూచించారు.
ఈ రోజు(మంగళవారం) వచ్చిన 82 కేసుల్లో 75 కేసులు ఆల్రెడీ ఉన్న క్లస్టర్ల నుండే వచ్చాయన్నారు. కేవలం 7 కేసులు మాత్రమే ఔట్ సైడర్ లకు వచ్చాయని... వాటి సోర్సెస్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏపీ లో డబ్లింగ్ రేట్ 9.8 గా ఉందని వెల్లడించారు.
టెలీ మెడిసిన్ అనేది ఏపీలో సత్ఫలితాలు ఇస్తుందని జవహర్ రెడ్డి తెలిపారు.స్టేట్ లెవెల్ లో 1170 మంది మెడికల్ ఆఫీసర్ల ను రిక్రూట్ చేసినట్లు వెల్లడించారు. త్వరలో నర్సులను కూడా రిక్రూట్ చేయనున్నట్లు తెలిపారు. రాజ్ భవన్ లో 4 గురికి కరోనా పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమేనని... గవర్నర్ కి కూడా కరోనా టెస్ట్ చేశామన్నారు. ఆయనకు నెగిటివ్ వచ్చిందని జవహర్ రెడ్డి తెలిపారు.