కరోనా కట్టడి చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీలో చర్చించామన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెమిడిసివర్ కొరతపైనా సబ్‌కమిటీలో చర్చించామని వెల్లడించారు. రుయాలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని నాని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచామన్నారు.

ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి తెలిపారు. ఆక్సిజన్ పైప్‌లైన్లను పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించామని.. అలాగే ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని ఆళ్ల నాని వెళ్లడించారు. రాష్ట్రంలోని ఆక్సిజన్ అవసరాలపై ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారని నాని గుర్తుచేశారు.

రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 517 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వ సామర్ధ్యం వుందని ఆళ్ల నాని తెలిపారు. దీనిని 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

ఆక్సిజన్న కొరత రాకుండా ముగ్గురు ఐఏఎస్‌లు పర్యవేక్షిస్తారని నాని వెల్లడించారు. ఫస్ట్‌వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎక్కువగా వుందని.. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా అవసరమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఆక్సిజన్ కొరత రాకుండా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఆళ్ల నాని చెప్పారు.

Also Read:రాజమండ్రిలో ఆక్సిజన్ ఆన్ వీల్స్: ఆర్టీసీ బస్సుల్లో కరోనా రోగులకు ఆక్సిజన్‌ బెడ్స్

వ్యాక్సినేషన్‌పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో అనవసరమైన ఆందోళనలు కలిగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కరోనా సమయంలో చంద్రబాబు బాధ్యతతో వ్యవహరించడం లేదని నాని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని.. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది జగన్ లక్ష్యమన్నారు.

రాష్ట్రాలు వ్యాక్సిన్ నేరుగా కొనుగోలు చేయొద్దని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆళ్ల నాని గుర్తుచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలోనిది కాదని బాబుకు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ కోసం రూ.1600 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా వున్నామని ఆళ్ల నాని పేర్కొన్నారు.

కరోనా కాలంలో కూడా ప్రజలకు అండగా నిలవాలన్నది సీఎం అభిమతమన్నారు. కానీ ఈ సమయంలో కూడా చంద్రబాబువి వికృత రాజకీయాలని మంత్రి ఎద్దేవా చేశారు. ఒకే రోజు 6 లక్షల డోసుల వ్యాక్సిన్ వేసిన ఘనత తమదేనని ఆళ్ల నాని గుర్తుచేశారు.