విజయవాడ: వైద్యులు, మెడికల్ సిబ్బంది రక్షణకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించేందుకు జిల్లా నోడల్ అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టాలని ఆయన సోమవారం జిల్లా కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు. 

వైద్య నిపుణులు, సిబ్బంది, వర్కర్లపై హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న దృష్ణ్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరిగినా మొత్తం హెల్త్ కేర్ కమ్యునిటీ అంతా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లుగా డీఎస్పీల నియామకం చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 235 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించారు. 

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 33, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం ఒక కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసుల నమోదులో 292 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 237 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, కృష్ణా జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరుకుంది. కొత్తగా అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో సంఖ్య 4కు చేరకుంది.