పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు మిగిలిన ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా సంపూర్ణ మద్ధతు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ , వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తమ మద్ధతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది

పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు మిగిలిన ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా సంపూర్ణ మద్ధతు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ , వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తమ మద్ధతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కీలక శాఖలు ఉద్యమంలోకి వెళ్తామని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు ఎస్మా ప్రయోగించడంపైనా ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్ధం చేస్తున్నారు ఉన్నతాధికారులు. 

అవసరమైతేనే ఎస్మా ప్రయోగించాలని అధికారులకు ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమ్మెలను నిషేధిస్తూ విద్యుత్ శాఖ ఇటీవలే జీవో జారీ చేసింది. తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎస్‌కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు వైద్య, విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఓ వైపు జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్‌కు ఉద్యోగులు సహకరించడం లేదు. 4.50 లక్షల బిల్లులకు కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయని ఏపీ ఆర్ధిక శాఖ చెబుతోంది. పరిస్ధితి చేయి దాటకుండా చూసుకునేలా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ఆరంభించినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినా, ఉద్యోగులు ముందుకు రాకపోవడం సరికాదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). ఉద్యోగుల్లో అపోహలు మరింత పెరగకూడదనే ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిందని సజ్జల గుర్తుచేశారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన హితవు పలికారు. 

మరోవైపు PRC సాధన సమితితో చర్చల కోసం ఎదురు చూపులుండవని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలుంటాయని ఆయన తేల్చి చెప్పారు. చర్చల కోసం ఉద్యోగ సంఘాల కోసం ఎదరు చూపులుండవని ఆయన స్పష్టం చేశారు. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారంగా ఏ ఒక్కరికి కూడా రూపాయి తగ్గదని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు. 

అయితే చర్చలకు రాలేదన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను ఏపీ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఖండించారు. తొమ్మిది మంది ప్రతినిధులను చర్చలకు పంపించామని తెలిపారు. జీవోలను పక్కనపెట్టి పాతజీతాలు ఇవ్వమని అడిగామని , వారిని అవమానం చేశారని బొప్పరాజు వాపోయారు. మంత్రుల స్థాయిలో ఉన్నవారు అబద్దాలు మాట్లాడొద్దని హితవు పలికారు. 3 నెలల నుంచి చర్చల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని వెంకటరామిరెడ్డి ఆరోపించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 3న లక్షమందితో 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుదలతో వున్నారు.