అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లోనే రాష్ట్రంలోని మహిళలు, రైతులను అండగా నిలిచింది వైసిపి సర్కార్. రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు సున్నావడ్డీకే రుణాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట నష్టపరిహారంను  కూడా ఇవాళే చెల్లించనున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆదాయాన్ని కోల్పోయి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికి వెనుకడుగు వెయ్యకుండా జగన్ ఈ సాయానికి సిద్దపడ్డారు. 

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  67,874 రైతు ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ సొమ్ము జమకానుంది. రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఈ సాయం  అందనుంది.  67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. ఈ  మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 

పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదు జమ కానుంది. ఆధార్‌ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిన నగదు డిపాజిట్  చేయనున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లబ్దిపొందిన రైతుల జాబితాల ప్రదర్శించనున్నారు. 

అలాగే పొదుపు సంఘాల మహిళల కోసం రూపొందించిన వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి  ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఆ వెంటనే 90,37,254 మంది మహిళల ఖాతాల్లోకి రూ.1400 కోట్లు జమ కానున్నాయి. వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాల మహిళలకు ఇప్పటికే సీఎం లేఖ రాశారు. ఇలా కరోనా కష్ట సమయంలో పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు అందనున్నాయి.  

కరోనా వల్ల‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతిన సమయంలోనూ మహిళల జీవనోపాధి రుణాలు, వారు చెల్లించాల్సిన వడ్డీ భారాలపై ఆలోచించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో వడ్డీ రాయితీ లభించడంతో పొదుపు సంఘాల మహిళల్లో సంతోషం కనిపిస్తోంది.