గుంటూరులో ప్రభుత్వ భూముల అమ్మకాలు... వైసిపి సర్కార్ ప్రకటన
సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుండేందుకు వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుండేందుకు వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల అమ్మకాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
విశాఖపట్నంలో ఆరు, గుంటూరులో మూడు చోట్ల ఇ-ఆక్షన్ ద్వారా భూముల అమ్మకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న ఇ-ఆక్షన్ ద్వారా వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. నగదు చెల్లింపు తరువాతే భూములపై పూర్తి హక్కులు కొనుగోలుదారులకు రానున్నాయి. ఎలాంటి ఆక్రమణలు, తగాదాలు లేకుండా భూములు వేలం వేస్తున్నట్లు బిల్డ్ ఏపీ ప్రకటించింది.
అయితే మిషన్‌బిల్డ్ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్లస్థలాలకు భూములు లేవంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు భూములను అప్పనంగా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే తతంగానికి తెరతీశారని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు ఇంతకుముందే ఆరోపించారు.
మిషన్‌బిల్డ్ వంకతో తమపార్టీ తాబేదార్లకు, అనుమాయులకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడానికి వైసీపీ సర్కారు ఉత్సాహం చూపడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయాంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని చెప్పి వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కాజేసిన వాన్‌పిక్ లాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి చేతగాలేదన్నారు.
అటువంటి సంస్థల కింద ఉన్న భూముల్ని వదిలేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వభూములపై కన్నేసిన జగన్ ఎన్నికల సమయంలో తనకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తులకు వాటిని కట్టబెట్టే కుతంత్రానికి తెరతీశాడని మండిపడ్డారు. ఉన్న భూముల్ని ఇష్టమొచ్చినట్లు తనవారికి దారాధత్తం చేస్తే, భవిష్యత్‌లో ప్రజల అవసరాలకు భూములు ఎక్కడినుంచి వస్తాయో వైసీపీ అధినేత సమాధానం చెప్పాలన్నారు.
ప్రభుత్వమే రియల్‌ఎస్టేట్ కంపెనీలా వ్యవహరించడం దారుణమని ఆయన వాపోయారు. ఓవైపు ప్రైవేట్‌భూములు కొనుగోలుచేసి పేదలకు ఇస్తామంటూనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చూడటం జగన్ తుగ్లక్ చర్యల్లో భాగమేనని రంగారావు దుయ్యబట్టారు. వనరుల నుంచి సంపద సృష్టించడం చేతగాని అసమర్థ వైసీపీ ప్రభుత్వం భూముల్ని అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటన్నారు.
లోటుబడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన చంద్రబాబు, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా చేశారని సుజయకృష్ణ తెలిపారు. వైసీపీ పాలన చూసి భయభ్రాంతులకు గురైన పారిశ్రామికవేత్తలు పక్కరాష్ట్రాలకు తరలిపోతుంటే బ్యాంకుల, ఇతర రుణ మంజూరు సంస్థలు ప్రభుత్వ వైఖరితో చేతులేత్తేసిన దుస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామన్నారు.
పెట్టుబడిదారుల్లో నమ్మకం సృష్టించలేని వైసీపీ సర్కారు చివరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి పూనుకుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న ఆదానీ గ్రూప్ (రూ.70వేలకోట్ల పెట్టుబడులతో విశాఖ పట్నంలో పెట్టాలనుకున్న పరిశ్రమ) తెలంగాణకు తరలడానికి సిద్ధమైందన్నారు.