''విశాఖలో కరోనా కేసులను దాస్తున్న జగన్ ప్రభుత్వం...కేంద్రానికి సీనియర్ ఐఎఎస్ లేఖ''
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే ఆ పేరుతో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని టిడిపి నాయకులు ఆరోపించారు.
గుంటూరు: కరోనాపై పోరాడే సిబ్బందికి సరిపడా రక్షణ పరికరాలు ఇవ్వకపోగా ఇచ్చినవి కూడా నాసిరకంగా వున్నట్లు తెలుస్తోందని టిడిపి నాయకులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రజలను కరోనా నుండి కాపాడేవారికే రక్షణ లేకుండా ప్రభుత్వ చర్యలు వున్నాయని... ఇది వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని మండిపడ్డారు.
''కరోనా పేరుతో ఎంఐడిసి షార్టు టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో అర్హతలేని వారికి దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఇచ్చారని వార్తలు వస్తున్నవి. ఛత్తీస్‌గఢ్ షార్టు టెండర్లు పిలిచి కొనుగోళ్లు చేయగా, జగన్ ప్రభుత్వం రూ.500 కోట్లు నామినేషన్‌పై ఇవ్వడం అవినీతి కోసం కాదా? కరోనాను సైతం అవినీతికి అడ్డాగా మార్చుకొన్నారు'' అని మండిపడ్డారు.
''రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు విషయంలో వైసిపి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ఈ ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటే రూ.500 కోట్ల కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే సీయం విరాళాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల విరాళాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని కాలవ డిమాండ్ చేశారు.
''కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతిని ఎత్తిచూపిన ప్రతిపక్షాలపై వైకాపా ఎదురుదాడి
చేస్తోంది. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం టెస్ట్ కిట్ల కొనుగోళ్లకు సంబంధించిన ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ కాపీని పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరు కిట్లను వినియోగంలోకి తీసుకొచ్చినప్పటికీ ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ కాపీను పబ్లిక్ డొమైన్ లో ఉంచ లేదు.? ఛత్తీస్ ఘడ్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (CGMSCL) వెబ్‌సైట్‌లో వివరాన్నీ ఉన్నాయి. కానీ ఏపీ కొనుగోళ్లకు సంబంధించిన ఏ విషయం కూడా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవప్ మెంట్ కొర్పొరేషన్ (APMSICDC) వెబ్‌సైట్‌లో ఎందుకు లేవు.? కనీసం టెండర్ నోటిఫికేషన్ కూడా లేదు.?'' అని నిలదీశారు.
''ఇంత పెద్దమొత్తంలో వైద్య పరికరాలు కొనుగోలు చేసినప్పుడు షార్ట్ టెండర్లు ఇవ్వాలి. కానీ కేవలం నామినేషన్ ద్వారా కొనుగోలు చేయడం జే ట్యాక్స్ కోసం కాదంటారా.? కిట్ ఒకటే.. రేటు తేడా ఉందంటే.. అందుకు 1. జే ట్యాక్స్?, 2. కమిషన్? 3. థర్డ్ పార్టీ ట్యాక్స్? ఇందులో ఏదో ఒక రకమైన లోపాయికారి ఒప్పందం జరగలేదు అంటారా.? మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోదరుడు కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తే ర్యాపిడ్ టెస్ట్ కిట్ కొనుగోళ్ల ఆర్డర్ పొందిన కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడు. దీని ఆంతర్యం ఏమిటి?'' అని ప్రశ్నించారు.
''అధికారంలోకి వచ్చీ రాగానే మీ కక్ష పూరిత వైఖరితో విశాఖలోని మెడ్ టెక్ జోన్ సేవను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు కేంద్రం ఆదేశిస్తే ఆఘమేఘాలపై ప్రారంభించారు. అదే మెడ్ టెక్ జోన్ సేవను తొలి నుండి వినియోగించుకుంటే ఎక్కడి నుండో కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి.? ఐసీఎంఆర్ నిబంధన ప్రకారం మూడు ఫ్లై మాస్కులు, నోస్ పిన్ ఉండాలి. మెటీరియల్ నాణ్యమైనదై ఉండాలి. కానీ.. అలాంటి నాణ్యతా ప్రమాణాలు ఏమీ లేకపోగా.. నాసిరకం క్లాత్ కారణంగా కిరోసిన్ కంపు వస్తోందని వైద్య సిబ్బంది వాపోతున్నారు'' అని అన్నారు.
'' ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులకు ఎన్ 95 రకంలోని ఎస్.ఎస్.పి.3 మాస్కులు ఇవ్వాల్సి ఉండగా.. ఎస్.ఎస్.పి 1 రకం ఇస్తున్నారు. ఇవి వైద్య అవసరాలకు ఏమాత్రం సరిపోవని, పొల్యూషన్ బారిన పడకుండా మాత్రమే ఉపయోగపడతాయని చెబుతున్నారు. మొబైల్ ఎక్స్ రే మెషీన్ మార్కెట్లో రూ.1.75 లక్షకే దొరుకుతుంటే.. ప్రభుత్వం రూ.3 నుండి రూ.4 లక్షకు కొనుగోలు చేస్తోంది. శానిటైజర్లలో స్పిరిట్ తప్ప మరో ద్రావణం లేదని, దీంతో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు'' అని ఆరోపించారు.
''రాష్ట్రంలోని ప్రజందరికీ ఒక్కొక్కరికి మూడు మాస్కులు ఇస్తామని హడావుడి చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో మాస్కు తయారీకి రూ.3.50 చొప్పున 16 కోట్ల మాస్కులకు రూ.56 కోట్లు ఖర్చవుతుంది. ఇందుకు కోటిన్నర మీటర్ల గుడ్డ అవసరం అవుతుంది. కానీ ఆప్కో నుండి తెప్పించింది 20 లక్షల మీటర్లు మాత్రమే. అంటే.. ఈ గుడ్డతో తయారయ్యే మాస్కులు ఎన్ని.? ఇస్తామంటున్నది ఎంత మందికి.?'' అని ప్రశ్నించారు.
''రాష్ట్ర ప్రభుత్వం కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విశాఖలోని కేసుల్ని దాచిపెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని సీనియర్ ఐఏఎస్ అధికారి శర్మ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా.? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి.? క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం కూడా పెట్టడం లేదని, సరైన సదుపాయాలు లేవని మీ ఎమ్మెల్యే ముస్తఫా చెప్పిన విషయం వాస్తవం కాదా.?'' అని ప్రశ్నించారు.
''రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలు తగ్గించడంపైన పెద్ద ఎత్తున కృషి చేస్తుంటే మన ముఖ్యమంత్రి మాత్రం రాజధాని తరలించడం, ఎన్నికలు నిర్వహించడం, రాజకీయంగా కక్ష సాధించడంపైనే దృష్టి సారించారు. రాష్ట్ర ప్రజలు కరోనా భయంతో భీతిల్లుతుంటే ముఖ్యమంత్రి గారు తాడేపల్లి రాజప్రాసాదాన్ని వదిలి రావడం లేదు. అదే కేరళ ముఖ్యమంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి ప్రజా క్షేత్రంలోకి వచ్చి వాళ్ల రాష్ట్రాల్లో కేసులు పెరగకుండా నివారించ గలిగారు'' అని కాలవ పేర్కొన్నారు.