అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సెక్యూరిటీ కవర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించింది. కాన్వాయ్ కదలిక సమయంలో ఉపయోగించే సెక్యూరిటీ కవర్ ను నిఘా భద్రతా విబాగం ఉపసంహరించుకుంది. 

చంద్రబాబుకు ఉన్న జడ్ ప్లస్ కెటగిరీ భద్రత, బ్లాక్ క్యాట్ కమెండోల భద్రత కొనసాగుతుంది. చంద్రబాబు ఇక ఏ మాత్రం ముఖ్యమంత్రి కాకపోవడంతో ఆయన కాన్వాయ్ ముందుకు కదిలినప్పుడు పనిచేసే అడ్వాన్స్ పైలట్లను ఉపసంహరించినట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుభవించిన కొన్ని ప్రోటోకాల్స్ ను ప్రస్తుతం తొలగించినట్లు, ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకపోవడంతో ఆ పనిచేసినట్లు చెబుతున్నారు. అడ్వాన్స్ పైలట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేటాయించినట్లు తెలుస్తోంది. 

అది సెక్యూరిటీని తగ్గించడం కాదని, వివిఐపిలకు సంబంధించి భద్రతా మార్గదర్శకాలను సూచించే బ్లూ బుక్ నిబంధనలను అమలు చేయడమేనని అంటున్నారు.