Asianet News TeluguAsianet News Telugu

రాజధానిలో పేదల ఇళ్ల స్థలాల కోసం అదనపు భూమి కేటాయింపు.. ఏయే జిల్లాల్లో ఎంతంటే..?

ఏపీ రాజధాని అమరావతిలో పేదల కోసం అదనపు భూమిని కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం 268 ఎకరాలను కేటాయిస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ap govt allocated additional land for house sites to poor in amaravati ksp
Author
First Published May 9, 2023, 8:55 PM IST | Last Updated May 9, 2023, 9:10 PM IST

ఏపీ రాజధాని అమరావతిలో పేదల కోసం అదనపు భూమిని కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం 268 ఎకరాలను కేటాయిస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో 100 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 168 ఎకరాలను అదనంగా కేటాయిస్తున్నట్లు పేర్కొంది. గుంటూరు జిల్లా పరిధిలోని బోరుపాలెం, పిచ్చుకపాలెం, అనంతవరం, నెక్కల్లులో భూమి కేటాయించినట్లుగా తెలుస్తోంది.  అదనపు భూమి కావాలంటూ గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 

ఇప్పటికే రాజధానిలో పేదల కోసం 1134 ఎకరాలు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. గుంటూరు జిల్లాలో మొత్తం 23,235 మంది లబ్ధిదారులు వుండగా.. ఎన్టీఆర్ జిల్లాలో 26,739 మంది లబ్ధిదారులు వున్నారు. కొత్తగా ఎన్టీఆర్ జిల్లాలో 6,055 మంది లద్ధిదారుల కోసం 168 ఎకరాలు.. గుంటూరు జిల్లాలో కొత్తగా 3,417 మంది లబ్ధిదారుల కోసం 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ నుంచి రూ.65.93 కోట్లుకు భూమిని కొనుగోలు చేశారు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎస్ 3 పరిధిలో అదనంగా భూ కేటాయింపులు జరిపింది సర్కార్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso Read: అమరావతి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి ముహుర్తం ఖరారు.. !

ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతిలో బయట ప్రాంతాలకు చెందిన భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ప్రభుత్వం జారీ  చేసిన జీవో 45, దాని ప్రకారం చేసే ఇళ్ల స్థలాల కేటాయింపు తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని  హైకోర్టు తెలిపింది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన ఫుల్‌ బెంచ్‌ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించకపోవడంతో మధ్యంతర స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

ఈ క్రమంలోనే ఆర్- 5 జోన్‌ అంశంపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిచారు. ఈ అంశంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. రైతుల పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని వారి తరపు న్యాయవాదులు సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావనకు తీసుకువచ్చారు. అయితే ఆ పిటిషన్‌ను వచ్చేవారం విచారించనున్నట్టుగా సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి తేదీని ధర్మాసనం ఖరారు చేయలేదు. 

మరోవైపు రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది. ఈ నెల 18న ఆర్-5 జోన్‌లో పేదలకు భూములు పంపిణీ చేయనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios