అమరావతి: హైకోర్టులో వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున కేసులను వాదించే ముగ్గురు  న్యాయవాదులను తప్పించింది వైసిపి ప్రభుత్వం. హైకోర్టులో పిపిలుగా పనిచేస్తున్నపెనుమాక వెంకట్రావు, గెడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్ లు రాజీనామా చేయగా వెంటనే ఆ రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. 

 ఈ రాజీనామాల వ్యవహారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు.  కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన పలు వివాదాస్పద అంశాల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిందని...'తాను ఆడలేక మద్దెల ఓడు' అన్నట్లు ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులను రాజీనామా చేయించటం సరికాదన్నారు. 

ప్రభుత్వం చేసే తప్పులకు న్యాయవాదులు ఎలా కారణమవుతారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ తన విధానాలను మార్చుకోకపోతే ఏ లాయర్లను పెట్టినప్పటికి కోర్టు తీర్పుల్లో మార్పులుండవని రామకృష్ణ అన్నారు. 

సుప్రీంలో జగన్‌కు షాక్: హైకోర్టు తీర్పుపై 'స్టే'కి నిరాకరణ

ఏపీలో వైసీపీ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న వివిధ నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతూ వస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై ప్రతిపక్షాలు, ఇతరులు కోర్టును ఆశ్రయించడం... న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరుగుతోంది. ఈ ఏడాది పాలనలో ఒకటి కాదు రెండు కాదు అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టడం గమనించాల్సిన అంశం. 2019 జూలై నుంచి ఇప్పటివరకూ హైకోర్టు 64 సార్లు  ప్రభుత్వానికి మొట్టికాయలు వై
వేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

దీంతో ప్రభుత్వం తాజాగా పిపిలను తప్పించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలతోనే న్యాయవాదులు రాజీనామాలు చేయగా వెంటనే వాటిని ఆమోదించినట్లు తెలుస్తోంది.