చంద్రబాబుపై వ్యతిరేక వ్యాఖ్యలతో చిక్కుల్లో ఏపి సిఐడి చీఫ్, ఏఏజి... గవర్నర్ సంచలన ఆదేశాలు
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిమరీ మాట్లాడిన ఏపి సిఐడి చీఫ్ తో పాటు ఏఏజి పొన్నవోలుపై విచారణకు ప్రభుత్వాన్ని ఆదేశించారు గవర్నర్.
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన సిఐడి చీఫ్, రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వ ప్రతినిధులుగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పక్షపాత దోరణితో వ్యవహరించడమే కాదు లా ఆండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించినట్లు సిఐడి చీఫ్ సంజయ్ తో పాటు ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు అందాయి. దీంతో వీరిపై ప్రభుత్వం తరపున విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ ఆదేశించారు.
చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలపై ఇటీవల ఏపీ సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజి పొన్నవోలు ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ అధికారులుగా కొనసాగుతున్న వీరు వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే గత నెల 23 న సత్యనారాయణ అనే ఆర్టిఐ కార్యకర్త ఈ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. దీనిపై తాజాగా స్పందించిన గవర్నర్ సిఐడి చీఫ్, ఏఏజి తీరుపై ఎంక్వయిరీ చేయాలని,శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిఐడి తరపున ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజి పొన్నవోలు హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ క్రమంలోనే వారు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతపై పక్షపాత దోరణితో వ్యహరించారని... అధికార పార్టీ వైసిపి తరపున మాట్లాడారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై గవర్నర్ కూడా ఫిర్యాదులు అందాయి.
Read More ఏపీ ఫైబర్ నెట్ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా
అలాగే ఇటీవల టిడిపి నాయకుల బృందం కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారని... ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణాలమాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు 50 పేజీల నివేదికను అందించారు. ప్రజావేదిక కూల్చివేత నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించామని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెడుతున్నారని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
ముందు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామని సీఐడీ చేస్తున్న వాదనలను నజీర్‌కు వివరించామని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కాంలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గవర్నర్‌కు తెలియజేశామని అచ్చెన్నాయుడు చెప్పారు. తమ వివరణపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని.. వ్యవహారం కోర్టు పరిధిలో వున్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడనని గవర్నర్ తమతో చెప్పారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఇలా టిడిపి బృందం కలిసిన వెంటనే గవర్నర్ ఏపి సిఐడి చీఫ్, ఏఏజి పై చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. అయితే గవర్నర్ ఆదేశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.