తుని: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వవిప్ దాడిశెట్టి రాజా. లోకేష్ కు ట్వీట్ చేయడం కూడా రాదని విమర్శించారు. దివంగత సీఎం వైయస్ఆర్ పై లోకేష్ పెట్టిన ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్‌ జనరల్‌ డయ్యర్‌ కన్న దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. బషీర్‌ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి అమాయకులను పొట్టనపెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఆ విషయం నారా లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను చూసి ఓర్వలేకనే ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాజా విరుచుకుపడ్డారు. 

గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడి తమపై విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేని లోకేష్ ఇంట్లో కూర్చోని ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు.  

లోకేష్ కు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేయడం రాదంటూ సెటైర్లు వేశారు. లోకేష్ తీరు చూస్తుంటే ఎవరికో జీతం ఇచ్చి మెసేజ్ లు పెడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. గత ఎన్నికల్లో రూ.300కోట్లు ఖర్చుపెట్టినా మంగళగిరి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో లోకేష్ గుర్తుంచుకోవాలని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సూచించారు.