ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల(బీసీల) కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాల కోసం త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల(బీసీల) కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాల కోసం త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి సీఎం జగన్, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, విడుదల రజిని తదితరులు నివాళులర్పించారు. ఆ తర్వాత మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు ఫూలేను స్ఫూర్తిగా తీసుకుని మెరుగైన సమాజం కోసం ఆయన ఆశయాలను పాటించాలన్నారు.

వెనుకబడిన తరగతుల(బీసీల) కుల గణనను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టుగా మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని బీసీ కేటగిరీలోని 139 కులాలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు బీసీ కులాల గణనను నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పారు. 

ఇక, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ.. ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బిహార్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్దం చేయనుంది. ఇదిలా ఉంటే.. బీసీ జనగణన చేపట్టాని వైఎస్ సర్కార్ ఇప్పటికే కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా చేసింది.