మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహరంపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం.

అమరావతి: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహరంపై సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.మూడు మాసాల్లో నివేదిక సమర్పించాలని కోరింది. మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.ఈ మేరకు నోడల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ కమిషనర్‌ను నియమించింది.

also read:మాన్సాస్‌ట్రస్ట్ వివాదంలో మరో ట్విస్ట్: ఛైర్మెన్ పదవి నుండి ఆశోక్‌గజపతిరాజును తప్పించాలని ఊర్మిళ పిటిషన్

ఇక సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ లో భారీగా భూములు తొలగించినట్టుగా గుర్తించారు. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయంలో అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.ఈ విషయమై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక అందించింది.దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ వ్యవహరం మీడియాలో ప్రముఖంగా విన్పిస్తోంది.
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా ఉన్న ఆశోక్‌గజపతిరాజును తప్పించి తనను ఛైర్మెన్ గా కొనసాగించాలని ఆనందగజపతి రాజు రెండో భార్య కూతురు ఊర్మిళ గజపతిరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.