ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై హై కోర్టు సీరియస్ అవడం, ఆ తరువాత ప్రభుత్వం టెర్రకోట రంగును కూడా కలిపి వేయడం, హై కోర్టు ఆగ్రహానికి గురై కోర్టు ధిక్కరణ కింద అధికారులను కోర్టుకు హాజరుకామ్మన్న విషయం తెలిసిందే. 

ఆ తరువాత నిన్న సాయంత్రం వైసీపీ వర్గాల నుంచి ప్రభుత్వ భవనాల రంగులను మారుస్తున్నట్టు కొన్ని లీకులు వెలువడ్డాయి. రంగులను మార్చేసి పూర్తిగా సున్నం వేయనున్నట్టు కొన్ని వర్గాలు వెల్లడించాయి. 

కానీ ఏమయిందో తెలీదు, నేటి ఉదయం అనూహ్యంగా సుప్రీంకోర్టు తలుపును తట్టింది జగన్ సర్కార్. భవనాల రంగులకు పార్టీ రంగులకు తోడుగా వైసీపీ సర్కార్ మరో రంగు టెర్రాకోటను కలిపి వాటికి ఒక నూతన నిర్వచనం ఇచ్చిన విషయం తెలిసిందే!

రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మూడు నెలల గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేవలం మూడు వారల సమయాన్ని మాత్రమే ఇచ్చింది. 

ఇలా ఈ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైకోర్టు తన తీర్పులో భవనాలకు పార్టీ రంగులను తీసేసి, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని రంగులు వేయమని చెప్పింది. 

ఇలా చెప్పినప్పటికీ కూడా వైసీపీ వారు ఒక నూతన థియరీని తెరమీదకు తెచ్చారు. వారు తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులనే వేశారు. కాకపోతే చిన్న ట్విస్టు ఇచ్చి రైతు భరోసా కేంద్ర భవనం కింద భాగాన ఒక రకమైన ఎర్ర మట్టి (టెర్రా కోట ) రంగును వేశారు. దానిపైన గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే బొమ్మలను పెయింటింగులుగా వేశారు. 

మిగితా రంగులన్నీ కూడా వైసీపీ పార్టీ రంగులు అలానే యథాతథంగా ఉన్నాయి. పార్టీ రంగులను మార్చలేదేందుకు అనే ప్రశ్నకు వైసీపీ వారు సరికొత్త రీతిలో ఒక తెలివైన సమాధానం చెబుతున్నారు. 

కింద ఉన్న మట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమని, మిగిలిన రంగులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. నీలం రంగు నీలి విప్లవానికి(చేపల ఉత్పత్తికి సంబంధించింది), ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి (పంటల పెంపకానికి సంబంధించినది), తెలుపు రంగు క్షీర విప్లవానికి (పాల ఉత్పత్తికి) చిహ్నాలని వారు చెబుతున్నారు. 

హై కోర్టు క్లియర్ గా ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేని రంగులను వేయమని చెప్పినప్పటికీ కూడా ఇలా వారి పార్టీ రంగులకే ఒక కొత్త నిర్వచనం చెప్పి వాటిని అలాగే ఉంచడం నిజంగా విడ్డూరం. 

హై కోర్టు దీన్ని కోర్టు ధిక్కారణగా భావించి ఏకంగా ప్రభుత్వ అధికారులనే విచారణకు హాజరుకమ్మని చెప్పింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. 

కోర్టులో ఈ విషయం తేలడానికి సమయం పడుతుంది, ఆ కేసులో ఓటమి చెందడానికి అవకాశం మెండుగా ఉన్నప్పటికీ... ఈ సమయంలో ప్రతిపక్షం చేతికి అస్త్రాన్ని మాత్రం ఇవ్వదల్చుకోలేదు అధికార పక్షం. 

అందునా నేడు మహానాడు జరుగుతున్న సందర్భం. నేటి ఉదయం గనుక రంగులు మారుస్తున్నాం అని ఒప్పుకొని ఉంటే.... వారు దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకొని ఈ సందర్భంగా దానిపై చర్చ పెట్టుండేవారు. 

ఇప్పటికే టీటీడీ విషయంలో, బిల్డ్ ఏపీ విషయంలో విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలకు ఇది కూడా తోడైతే మరింతగా అధికారపక్షంపై దాడికి దిగే ఆస్కారం ఉన్నందున వైసీపీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియవస్తుంది.