అమరావతి:కర్నూల్‌లో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయమై గురువారం నాడు ఏపీ ప్రభుత్వం కొంత స్పష్టత ఇచ్చింది.

టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ శాసనమండలిలో వేసిన ప్రశ్నకు ప్రభుత్వం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ  నివేదిక ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

రాజధానిలో పరిపాలనా, న్యాయపరమైన వ్యవహారాలు కూడ భాగమేనని కూడ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కర్నూల్‌లో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఆందోళనలు సాగుతున్నాయి.

రాజధాని ఏర్పాటు విషయమై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. హైకోర్టు విషయమై ఆందోళనలు సాగిస్తున్న వారి నుండి కూడ నిపుణుల కమిటీ వివరాలను గతంలో సేకరించింది.

తమ డిమాండ్‌ కోసం నిరసనకారులు మంత్రుల ఇళ్లను ముట్టడించారు. కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని బీజేపీ కూడ చెప్పింది.  సమగ్ర పద్దతిలో రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కేఈ ప్రభాకర్ కు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిపుణుల కమిటీ ఇప్పటికే ఓసారి సీఎం జగన్‌తో భేటీ అయింది. అయితే మధ్యంతర నివేదికఇవ్వాలనే డిమాండ్ కూడ ఉంది. దరిమిలా ఈ నెలాఖరుకే నిపుణుల కమిటీ నివేదిక వచ్చే అవకాశం ఉందని సమాచారం.