అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  లాక్‌డౌన్ సడలింపుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను బుధవారంనాడు విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్పరెన్స్ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు.

వ్యవసాయరంగంతో పాటు హార్టికల్చర్ పనులకు మినహాయింపును ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్లాంటేషన్ పనులు, వరికోత, పుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ రంగాలకు లాక్ డౌన్ ఆంక్షలను మినహాయించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు అనుమతి ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ కామర్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చారు. ఈ కామర్స్ కంపెనీలు వాడే వాహనాలకు కూడ అనుమతి తీసుకోవాలని సూచించింది. అనుమతి తీసుకొన్న వాహనాలకు ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పింది.

ఆర్ధిక రంగానికి ఆంక్షలు లేవని తేల్చి చెప్పేసింది జగన్ సర్కార్. రాష్ట్రంలోని తమ స్వంత ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకొనేందుకు వలస కార్మికులను అనుమతి ఇచ్చారు. అయితే కరోనా లక్షణాలు లేని వారికే ఆంక్షలు ఉండవు. కరోనా లక్షణాలు ఉంటే ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయి.

also read:కరోనా ఎఫెక్ట్: గుజరాత్ నుండి బస్సుల్లో ఏపీకి 5 వేల మంది మత్స్యకారులు

వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో పనులు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వనున్నారు. బుక్ షాపులకు అనుమతి ఇచ్చారు. ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, షాపులకు మినహాయింపు ఇచ్చారు. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతంలో ఉండే దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్ కు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.