బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 5 లక్షలు: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
విశాఖపట్టణం: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండంగా ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆదివారం నాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి లక్ష రూపాయాలు అందిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన గురుమూర్తి కుటుంబానికి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించనున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడుగా మంత్రి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి ఒడిశాలోని బాలాసోర్ లో నివాసం ఉంటున్నారని ఆయన తెలిపారు. ఏపీలో పెన్షన్ తీసుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 20 మంది గాయపడ్డారన్నారు. వీరిలో 11 మంది కి చికిత్స అందించి ఇంటికి పంపించామన్నారు.
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ రైళ్లలో 635 మంది ఏపీ రాష్ట్ర వాసులు ప్రయాణం చేసినట్టుగా మంత్రి తెలిపారు. వీరిలో 553 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారన్నారు. ఇంకా 28 మంది ఫోన్లకు రెస్పాండ్ కావడం లేదని మంత్రి వివరించారు. వీరి ఫోన్ నెంబర్ల ఆధారంగా లోకేషన్లు ట్రేస్ చేసి వారి ఇళ్లకు వెళ్లి సమాచారం తెలుసుకుంటున్నామని మంత్రి బొత్స వివరించారు.
also read:ఒడిశా రైలు ప్రమాదానికి కారణం గుర్తించాం: కేంద్ర మంత్రి ఆశ్విన్ వైష్ణవ్
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష పరిహరం అందించనున్నట్టుగా చెప్పారు.
ఇంకా 180 మృతదేహలను గుర్తించాల్సి ఉందన్నారు. అన్ రిజర్వ్ బోగీలలో ప్రయాణం చేసినవారి వివరాలను సేకరిస్తున్నామన్నారు.