పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలకు చంద్రబాబు సర్కార్ నిర్వాకమే కారణమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలకు గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని ఆయన వివరించారు.
అమరావతి: చంద్రబాబు నిర్వాకం వల్లే పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 2015లోనే చంద్రబాబు పెట్రోల్, డీజిల్‌పై రూ.4 అదనంగా పెంచారని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ చార్జీలను కూడ టీడీపీ సర్కార్ పెంచిన విషయాన్ని ఆయన స్రస్తావించారు.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయంలో వర్షాలు కురవక కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఏనాడూ కూడ సమృద్దిగా వర్షాలు కురవలేదన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టీడీపీకి లేదన్నారు. చంద్రబాబు సీఎం అధికారంలో ఉన్న సమయంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా కూడ మీడియా పట్టించుకోలేదన్నారు. కానీ ఇటీవల కాలంలో వర్షాలు కురవడంతో అక్కడక్కడ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు.
చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాల కారణంగా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందులను తట్టుకొనేందుకు పెట్రోల్ చార్జీలు పెంచినట్టుగా ఆయన చెప్పారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు లేవన్నారు. టీడీపీ సర్కార్ రోడ్ల మరమ్మత్తులను పట్టించుకోలేదని చెప్పారు.
కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దిగజారినా కూడ ప్రజలపై భారం మోపకుండా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.తమ సమస్యలు పరిష్కరించాలని నిలదీసినా కూడ సమాధానం చెప్పలేదన్నారు.
