విజయవాడ:  ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకొంది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష చేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు.

పేకాట క్లబ్బుల విషయంలో తనపై మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంత్రి కొడాలినాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలో పేకాట క్లబ్బులపై దాడులు చేయాలని తాము చెబితే పోలీసులు దాడులు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై దేవినేని ఉమ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దేవినేని ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తానని ఆయన హెచ్చరించారు.మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడ అదే స్థాయిలో కౌంటరిచ్చారు. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా తాను దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.

విజయవాడ గొల్లపూడి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని ప్రకటించారు. తన దీక్ష వద్దకు రేపు సీఎం వస్తారో కొడాలి నాని వస్తారో రావాలంటూ దేవినేని ఉమ సవాల్ విసిరారు.ఎన్టీఆర్ విగ్రహాం వద్ద తాను దీక్ష చేసే  సమయంలో టచ్ చేసి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.