టీడీపీ నేతలు మాటలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పవర్ ఫైనాన్స్ అప్పులపై ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తోందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ అప్పు కోసం వెళితే.. ఫిబ్రవరిలో ఏ+క్రిసిల్ రేటింగ్ వచ్చిందని బుగ్గన తెలిపారు.

కేవలం జూన్ నెలలో మాత్రం ఓవర్‌డ్రాఫ్ట్ ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి మెరుగ్గానే ఉందని గత ప్రభుత్వం చేసిన పనుల కారణంగా కరెంట్ సమస్యలు ఉత్పన్నమయ్యాయని బుగ్గన ఎద్దేవా చేశారు.

టీడీపీ ప్రభుత్వ పెద్దలు నాడు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ రావడానికి కొంత సమయం పడుతుందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్‌ను అద్భుతంగా మేనేజ్ ‌చేస్తామని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారని ఆయన సెటైర్లు వేశారు.

బాబు హయాంలో డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టారని... ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా ఎక్కువ రేటుకు విద్యుత్‌ను కొనుగోలు చేశారని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని..ఏమన్నా అంటే 40 ఇయర్స్ అంటారని రాజేంద్రనాథ్ రెడ్డి సెటైర్లు వేశారు.

25 సంవత్సరాల కోసం హడావుడిగా పీపీఏలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. 2018-19లో 43 రోజులు ఓడీలో ఉన్నామని.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో ఒక్క రోజు కూడా ఓడికి వెళ్లలేదని గుర్తు చేశారు. రూ.14,857 కోట్లు విద్యుత్ సంస్ధలకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని.. ఇలా ఉంటే విద్యుత్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని బుగ్గన ప్రశ్నించారు.

వూరి బయట ఉండాల్సిన మద్యం దుకాణాలను జనం మధ్యలోకి తీసుకొచ్చింది చంద్రబాబేనని.. తమ ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

రూ.42 వేల కోట్ల అప్పులను వైసీపీ ప్రభుత్వంపై పెట్టారని.. ఇలాంటి వారు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బుగ్గన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో బడా కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రం ఒకే రోజులో క్లియర్ చేశారని రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తుచేశారు.

2003-04 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 25,959గా ఉందని.. 2013-14 నాటికి రూ.85,797 కోట్లు అయ్యిందని, 2014-15 నాటికి రూ.93,903 నాలుగు సంవత్సరాల తర్వాత లక్షా 42 వేల 500 అయ్యిందన్నారు.

చంద్రబాబు-యనమల రామకృష్ణుడు కాంబినేషన్ వచ్చిందంటే అప్పులు పెరిగిపోతాయని 1995-2004, 2014-19 మధ్యకాలంలో ఇదే జరిగిందని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

కమీషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను డిజైన్ చేసిందని మంత్రి ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.700 కోట్లు మిగిలాయని ఆయన గుర్తుచేశారు. ఏడాదిలోగా అన్ని సమస్యలను సరిదిద్దుతామని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.